British Parliament

British Parliament

లండన్, జనవరి 11 (ప్రత్యేక ప్రతినిధి) తెలుగు సంస్కృతి సంప్రదాయాలు బ్రిటన్ దేశమంతటా పరిచయం చెయ్యాలనే సత్సంకల్పంతో యునైటెడ్ కింగ్డం తెలుగు సంఘం (యుక్తా) ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా లండన్ పార్లమెంట్ భవనంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించింది. బుధవారం పోర్ట్ కలిస్ హౌస్ లో జరిగిన ఈ వేడుకలకు లార్డ్ లూంబ, లార్డ్ ధోలాకియా, ఈలింగ్ సౌతాల్ పార్లమెంట్ సభ్యుడు వీరేంద్ర శర్మ, పశ్చిమ రెడింగ్ పార్లమెంట్ సభ్యుడు అలోక్ శర్మ, ఉత్తర వారిక్ షైర్ – బెడ్వర్త్  పార్లమెంట్ సభ్యుడు డాన్ బైల్స్, భారత రాయబార కార్యాలయ ప్రతినిధిగా చింతపల్లి రాజశేఖర్ హాజరయ్యారు. సుమారు 200 మంది ప్రవాసాంధ్రులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో యుక్తా అధ్యక్షుడు ప్రభాకర్ కాజా “యుక్తాపత్రిక” పేరుతొ బ్రిటన్లోని తొలి తెలుగు వార్తా పత్రికను ఆవిష్కరించారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన వీరేంద్ర శర్మ మాట్లాడుతూ తెలుగు వారి ఉనికి చాటి చెప్పటానికి యుక్తా చేస్తున్న ప్రయత్నం అభినందనీయం అన్నారు. ఇటువంటి ప్రయత్నాలు ఆంధ్ర రాష్ట్రానికే కాక యావత్ భారత దేశపు కీర్తి ప్రతిష్ఠలు ఇనుమడింప చేస్తాయన్నారు. నాలుగు దశాబ్దాల క్రితం బ్రిటన్ వచ్చి స్థిరపడిన భారతీయులు తమ హక్కుల కోసం పోరాడవలసి వచ్చేది. ప్రపంచీకరణ నేపధ్యంలో అనేక మంది ఇప్పుడు ఇక్కడికి రాగలుగుతున్నారని, చదువు, ఉద్యోగాలతో పాటు రాజకీయాల్లోకి కూడా రావాల్సిందిగా లార్డ్ ధోలాకియా యువతకు పిలుపునిచ్చారు. భారాతీయుల ఓర్పు సహనాలతో పాటు వారి చతురత, హాస్యాన్ని పండించి ఆస్వాదించే తీరు ప్రపంచాన్ని అబ్బుర పరుస్తోందని చమత్కరించారు. లార్డ్ లూంబ తమ లూంబ ఫౌండేషన్ ద్వారా అందించే సేవా కార్యక్రమాలను వివరించారు. 

 

భారత రాయబార కార్యాలయ రాజకీయ, ప్రెస్ మరియు ఇన్ఫర్మేషన్ శాఖ మంత్రి చింతపల్లి రాజశేఖర్ మాట్లాడుతూ యుక్తా సాధిస్తున్న అభివృద్ధిని కొనియాడారు. ఈ సందర్భంగా పత్రిక విడుదలకు అహో రాత్రాలు శ్రమించిన కార్యవర్గాన్ని అభినందించారు. బ్రిటన్ దేశంలో స్థిరపడిన తెలుగువారందరినీ ఏక త్రాటి పైకి తీసుకురావటానికి వారు చేస్తున్న ప్రయత్నానికి భారత సర్కారు తరఫున తన వంతు సహకారాన్ని అందించటానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. యుక్తా అధ్యక్షుడు కాజా ప్రభాకర్ మాట్లాడుతూ తెలుగు పండుగలకు విశిష్ట హోదా కల్పించాలన్న ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం సంక్రాంతి వేడుకలు పార్లమెంట్ భవనంలో, ఉగాది ఉత్సవాలు బర్మింగ్హాం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్నామని అన్నారు. తమకు అన్ని విధాల అండగా నిలుస్తున్న జీవిత సభ్యులకు, స్పాన్సర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. యుక్తా ట్రస్టీ మాధవ తురుమెళ్ళ సభికులకు సంక్రాంతి పండుగ విశిష్టతను వివరించారు. ఈ సంవత్సరం జూలై నెలలో ప్రప్రథమంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో “ప్రపంచ తెలుగు చరిత్ర మహోత్సవం” నిర్వహిస్తున్నట్లు యుక్తా ప్రతినిధి ప్రమోద్ పెండ్యాల విలేఖరులకు తెలిపారు. ప్రపంచ తెలుగు ప్రతినిధులందరినీ ఈ సందర్భంగా ఆహ్వానించనున్నట్లు ఆయన అన్నారు.

 

అనంతరం బాలు రఘురామన్, సుభద్ర రఘురామన్, బాల సంగీత కచేరీతో ప్రారంభమైన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను అలరించాయి. బేబీ సంహిత దూపగుంట్ల ప్రదర్శించిన “అదేంటి మామ”  తెలుగు జానపద నృత్యం సభికులను విశేషంగా ఆకట్టుకుంది. యశోద శృతి, ప్రకాష్ యదుగుడే శిష్య బృందం భారత నాట్యంతో పాటు బేబీ శ్రేయ శిష్ట్ల ఆలపించిన “చందమామ రావే” గీతం అందరి మన్ననలు అందుకొంది. నరేంద్ర మున్నలురి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.

 Click To Download Here

 Click To Download Here